Thursday, February 19, 2009

విష ప్రయోగం

Image Hosted by ImageShack.usపట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "రాజా, నీవంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతూంటాయి. దాని ఫలితంగానే నువ్వీ అపరాత్రివేళ ఇన్ని పాట్లకు గురి అవుతూ ఉండవచ్చు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉజ్జయనీ రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు:

ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడుండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులూ, మహరాజులూ మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలు సైతం దాటి వెళ్ళి, వాటిని ఖరీదు చేసేవాడు.

ఒకసారి అతను క్రౌంచద్వీపంలో "శిరీషకం" అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని యాభై లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగివచ్చాడు.

వజ్రగుప్తుడి వద్ద శిరీషకం ఉన్న వార్త తెలిసి ఉజ్జయినీ రాజు అతన్ని పిలిపించి వజ్రాన్ని పరీక్షించాడు. రాజుకు అది అపూర్వమైన వజ్రం అన్న నమ్మకం కలగగానే దాన్ని కొనాలని బుద్ధిపుట్టింది.

"వజ్రగుప్తా, ఈ మణిని కొనదలిచాం. పాతికలక్షల వరహాలకు మాకు అమ్మెయ్యి" అన్నాడు రాజు.

వజ్రగుప్తుడి గుండెలో రాయిపడింది. తానా వజ్రానికి నిశ్చయించిన ధరలో సగమే రాజు ఇస్తానంటున్నాడు. రాజు ఒక ధర చెప్పినాక అంతకు మించి అడగడం అమర్యాద అవుతుంది. ఇవ్వనంటే రాజుకు కోపం వస్తుంది. అందుచేత వజ్రగుప్తుడు ఏమీ అనలేకపోయాడు.

అది చూసి రాజు "మేము చెప్పిన ధర నీకు నచ్చలేదు లాగుంది?" అన్నాడు.

"అదేమీ లేదు మహరాజా. ఇది గ్రహ ప్రభావం గల వజ్రం. కొన్ని జన్మనక్షత్రాలు గలవారికే ఇది ఉపకరిస్తుంది. మరి కొందరికి నష్టమూ, కొన్ని జన్మనక్షత్రాలవారికి ప్రాణాపాయమూ కూడా కలిగించగల వజ్రం ఇది. అందుకే సందేహిస్తున్నాను" అన్నాడు వజ్రగుప్తుడు.

Image Hosted by ImageShack.usఅతను అబద్దం చెబుతున్నాడని రాజు గ్రహించి, తన జన్మనక్షత్రం చెప్పి "నాకిది ఎలాటి ఫలితాన్ని కలిగిస్తుందంటావు?" అన్నాడు.

వజ్రగుప్తుడు చప్పున "మహారాజా, తమకిది ప్రాణహాని కలిగించవచ్చు. దీన్ని మీరు కొనటం మంచిది కాదు" అన్నాడు. అదే జన్మనక్షత్రం గల మరొక వర్తకుడు ఆ వజ్రాన్ని కొన నిరాకరించినట్టు కూడా అతను రాజుతో అన్నాడు.

రాజు నవ్వి " నాకా భయాలు లేవు. అన్నిటికీ తెగించి నేనీ వజ్రాన్ని కొనదలిచాను. అందుచేత నువు నిశ్చింతగా దీన్ని మాకు అమ్మవచ్చు" అన్నాడు.

వజ్రగుప్తుడు శిరీషకాన్ని రాజుకు అమ్మక తప్పలేదు.

ఈ సంగతి రాజకుమారుడైన ప్రసేనుడికి తెలియ వచ్చింది. ప్రసేనుడు యువరాజు. అతను సూక్ష్మబుద్ధి గలవాడే గాని దుర్మార్గుడు. అతను వజ్రగుప్తుడి వద్దకు వెళ్ళి "ఏం, వజ్రగుప్తా, మహరాజుగారు నీ వజ్రాన్ని చాలా చౌకగా కాజేసినట్టున్నారే! దానివల్ల ప్రాణగండం ఉన్నదని నువు భయపెట్టినా ఆయన భయపడలేదుట. అదీ ఒకందుకు మంచిదే అయింది. నువు నాకు ఒక చిన్న సహాయం చేసావంటే, ఆ వజ్రం నీకు తిరిగి లభిస్తుంది. దానికని నువు పుచ్చుకున్న పాతిక లక్షలూ తిరిగి ఇవ్వనవసరం కూడా ఉండదు. నేను చెప్పినట్టు చేస్తావా?" అన్నాడు.

"ఏమిటి తమ ఆజ్ఞ?" అన్నాడు వజ్రగుప్తుడు అనుమానంగా.


Image Hosted by ImageShack.us
"ఈ రాజు ఇంతలో చావడు. నేనిప్పట్లో సింహాసం ఎక్కే మార్గం లేదు. ఏ ఉపాయం చేతనైనా మనం ఆయనను చంపగలిగితే అనుమానం ఇప్పుడు వజ్రం మీదకి పోతుంది. అది కొంటే రాజుకు ప్రాణాపాయం కలగవచ్చునని నువు చెప్పనే చెప్పావు గద. వజ్రపు పొడి ప్రాణాలు తీస్తుందని విన్నాను. మామూలు విషాలలాగా దానికి రుచీ వాసనా ఉండదు.వజ్రపుపొడి ఉంటే ఇవ్వు. పాలలో కలిపి రాజుగారికిస్తాను" అన్నాడు యువరాజు.

వజ్రగుప్తుడు కొంచెం ఆలోచించి, "నా దగ్గర వజ్రపుపొడి ఉన్నది. కాని దాన్ని రాజుగారికి తమరే స్వయంగా పాలలో ఇవ్వాలి. ఈ పని మరొకరికి పెట్టకండి" అన్నాడు.

అందుకు ప్రసేనుడు ఒప్పుకొని, వజ్రగుప్తుడి దగ్గర వజ్రపుపొడి పొట్లం తీసుకొని వెళ్ళిపోయాడు.

ఇది జరిగిన వెంటనే వజ్రగుప్తుడు రహస్యంగా మహారాజును కలుసుకొని "మహారాజా, తమరు చాలా హెచ్చరికగా ఉండాలి. తమపై విషప్రయోగం చెయ్యాలని తమ శత్రువులు యత్నిస్తున్నారు. ముందుగా వైద్యుల చేత పరీక్షింపకుండా తమరు ఏదీ తాగవద్దని నా విన్నపం" అని సలహా ఇచ్చాడు.

ఇది తన మేలుకోరి ఇచ్చిన సలహాయే కాబట్టి రాజు తాను తినే ఆహారాన్నీ, తాగే పానీయాలను తన ఆంతరంగ వైద్యుడి చేత ముందుగా పరీక్షింపచేయడం ప్రారంభించాడు.

ఒకరోజు రాత్రి రాజుగారు పడుకోబోయే ముందు ఆయన తాగే పాలను ప్రసేనుడే తెచ్చి ఇచ్చాడు.

Image Hosted by ImageShack.us
"పాలు నువ్వే తీసుకొచ్చావా నాయనా? పనివాడేమయ్యాడు?" అంటూ రాజు పాలలోటా అందుకొని నోటికెత్తుకున్నాడు. కాని అంతలోనే ఆయనకు వజ్రగుప్తుడి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఆయన పాలలోటా తీసుకొని తన రహస్య మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వైద్యుడా పాలను పరీక్షించి అందులో వజ్రపుపొడి కలిసినట్టు కనుక్కున్నాడు.

మర్నాడే రాజు తన యువరాజును రాజద్రోహిగా విచారణ చేసి, యావజ్జీవ కారాగార శిక్ష విధించి, తన ప్రాణాలను కాపాడిన వజ్రగుప్తుడికి అంతులేని కానుకలిచ్చాడు.

భేతాళుడీ కథ చెప్పి "రాజా, వజ్రగుప్తుడు ప్రసేనుడి యత్నాన్ని ఎందుకు పాడు చేసాడు? అందువల్ల తనకు నష్టమే తప్ప లాభం లేదే? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు.

దానికి విక్రమార్కుడు "వజ్రగుప్తుడు రాజద్రోహి కాదు. అతను యువరాజుకు వజ్రపుపొడి ఇచ్చిన మాట నిజమే. తాను వజ్రపుపొడిని నిరాకరించిన మాత్రాన యువరాజు రాజును హత్యచేయక మానడు. రాజు చస్తే అందరూ శిరీషకాన్నే నిందిస్తారు. దాన్ని గురించి తాను రాజుతో ఆడిన అబద్దం యువరాజును కాపాడుతుంది. అందుచేత, తనకు లాభం లేకపోయినా రాజు ప్రాణం కాపాడటం తన విధి అని వజ్రగుప్తుడు భావించి, రాజును హెచ్చరించాడు. ఇందువల్ల అతను తనను తాను రక్షించుకున్నవాడూ అయినాడు.ఎందుకంటే, రాజ్యంకోసం తండ్రిని చంపటానికి సిద్ధపడిన ప్రసేనుడు రాజయ్యాక తన రహస్యం తెలిసిన వజ్రగుప్తుణ్ణి బతికి ఉండనిస్తాడా? ఏ విధంగా చూసినా వజ్రగుప్తుడి ప్రవర్తన సమంజసంగానే ఉన్నది" అన్నాడు.

రాజుకీవిధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

Image Hosted by ImageShack.us


- ఏప్రిల్ 1969

20 comments:

  1. చాలా మంచి ప్రయోగం, మరుగున పడిపోయిన పాత సంచికల నుండి కథలను మళ్ళీ ఇప్పటి తరం వారు చదువుకునే వీలు కల్పించినందుకు మనఃపూర్వక అభినందనలు

    ReplyDelete
  2. చాలా మంచిపని చేస్తున్నారు. అబినందనలు.

    ReplyDelete
  3. I am a big fan of chandamama. thanx for bringing the old stories to my generation.

    -Karthik

    ReplyDelete
  4. Can you pls update the blog couple of times a week :) i am a good fan of these stories :). Hats off to u!!!

    ReplyDelete
  5. regular ga update cheyyandi...nice effort

    ReplyDelete
  6. చందమామ కధలంటే నేను చెవి కోసుకొంటాను అందులో, బేతాళ కథలు అంటే మరీను.....చాల మంచి పని చేస్తున్నారు. మీకు నా అభినందనలు!

    ReplyDelete
  7. Very very very thanks!!!

    Siva Cheruvu

    ReplyDelete
  8. చాలా బాగున్నది బేతాళ కథలను అందరికీ అందించాలన్న ఈ ప్రయత్నం. నాదగ్గర మొట్టమొదటి బేతాళ కథ (1972 జులై లో పున:ముద్రణ). అది కూడ అందరికి అందిస్తే బాగుంటుంది. మీ ఈ మైలు నాకు తెలిస్తే నేను పి డి ఎఫ్ ఫైలును పంపగలను. నా బ్లాగును కూడ చూడగలరు. నేను కొన్ని చందమమ ధారావాహికలను అందించాను.
    http://saahitya-abhimaani.blogspot.com/

    ReplyDelete
  9. naku enka chala old storys kavalnu so plese.....

    ReplyDelete
  10. bhetala kadalu ante naku chala istam.thank u very much to u, idi chala abhinandaneyamaina visayam mana telugu pata kadalu maruguna padakunda meru chestunna e goppa karyaniki nalanti vari sahakaram eppudu untundi.

    ReplyDelete
  11. chala bagundi ,dhinivalana manalo vunde rashiswatwam bayataku poyi,manchi lakshanalu vastayi....chandamama patakulaku danyavadalu

    ReplyDelete
  12. chala bagundandi e kadha mari koni kathalu petagalaru

    ReplyDelete
  13. rendu kathale pettaru, mari migathavi?

    ReplyDelete
  14. చాలా మంచి ప్రయోగం, మరుగున పడిపోయిన పాత సంచికల నుండి కథలను మళ్ళీ ఇప్పటి తరం వారు చదువుకునే వీలు కల్పించినందుకు మనఃపూర్వక అభినందనలు

    ReplyDelete